జీవితాన్ని భారం చేసిన అప్పులు.. ఓ కుటుంబాన్ని మింగేశాయి. సొంతూరులో ఉపాధి దొరక్క.. నగరం బాట పట్టిన దంపతులు.. రుణాల భారం మోయలేక ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
భవన నిర్మాణ కార్మికుడు అయిన నాగప్ప 15 రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. మృతదేహాన్ని స్వస్థలం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. భర్త నాగప్ప మరణంతో అతని భార్య రుక్మిణి బాధలో కుంగిపోయింది. పదిహేను రోజులుగా ఏడుస్తూనే ఉంది.
భవిష్యత్‌పై భయంతో..
అప్పుల భారం మోయలేక భర్త తన దారి తాను చూసుకోగా.. మగ దిక్కు లేకుండా ఇద్దరు కూతుళ్లను ఎలా పోషించాలి అనుకుందో. భవిష్యత్‌పై భయం వెంటాడిందో ఏమో.. ఆ తల్లి తన ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు కూతుళ్లను చెరువులో తోసి.. తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది.
తల్లి, ఇద్దరు కూతుళ్లను ఒకే చితిపై పెట్టి కాల్పడం.. చూసేవాళ్ల హృదయాలను ద్రవింపజేసింది. అయితే.. గ్రామస్థులు, బంధువులు హుటాహుటినా అంత్యక్రియలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్య ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే దహనం చేశారు. పోస్టుమార్టం నిర్వహిస్తారన్న కారణంతో వెంటనే అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'నమ్మించి మోసం చేశాడు.. అతనికి శిక్ష పడాలి'