ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు రెండు రోజులకో ప్రాణం నీటి మునుగుతోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి 59 రోజుల్లోనే 38 మంది చనిపోయారు. ఇందులో పలువురు మైనర్లు ఉండడం కలచి వేసే విషయం. కామారెడ్డి జిల్లాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 47 మంది చనిపోతే.. చెరువుల్లో పడి 25 మంది చనిపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
ఎందుకిన్ని ప్రమాదాలు..?
● నీటి వనరుల్లో పూడిక తీసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం ప్రాణాల మీదకు తెస్తోంది. చెరువంతా సమానంగా కాకుండా ఓ చోట ఎక్కువ లోతు గుంతలు తవ్వుతున్నారు. ఈతకు, చేపలు పట్టేందుకు వెళ్లిన వారు ఇందులో చిక్కుకొని బయటకు రాలేక చనిపోతున్నారు.
● కాలువలు, చెరువులు, కుంటలు, బావుల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు సరదాగా దిగి నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
● రాత్రుళ్లు, తెల్లవారుజామున కాలకృత్యాలకు చెరువుగట్లకు వెళ్తున్న వృద్ధులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతున్నారు.
అవగాహన పెంచాలి..
● గ్రామాల్లో చిన్నపాటి విషయాలకు ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. క్షణికావేశంలో సమీపంలోని చెరువుల్లో దూకేస్తున్నారు. చచ్చి సాధించేదేదీ లేదన్న విషయంపై పోలీసులు, సామాజిక కార్యకర్తలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జీవితంపై ఆశను పెంచే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత వరకు కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
● నీటి వనరుల చుట్టూ జాలీలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా కాపాడవచ్చు. ఆలయాల్లోని కోనేర్లలో తరహా జాలీలు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది.
ఫిబ్రవరి 14న..
కామారెడ్డి జిల్లా కేంద్రం శివారు రామేశ్వర్‌పల్లి పరిధిలోని పల్లెవారి కుంటలో బావబామ్మర్దులు పడి చనిపోయారు. చుట్టం చూపుగా ఇంటికొచ్చిన వియ్యంకున్ని కాపాడబోయి బావమరిది కూడా విగతజీవిగా మారాడు.
ఫిబ్రవరి 16న..
భిక్కనూరు మండలం జంగంపల్లిలో మూడు పదుల వయసైనా నిండని ఓ బాలింత.. 13 నెలల పసికందుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అందుకు కొద్ది రోజుల ముందే ఆమె భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిగా జీవించలేక ఈ చర్యకు పాల్పడింది.
మార్చి 12..
రాజంపేటకు చెందిన జంగిటి బాలరాజు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడు. రెండు నెలల క్రితం ఆయన తమ్ముడు ఇదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి చనిపోయాడు.
మందలించినందుకు..
భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డికి చెందిన 26 ఏళ్ల యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం తాగొద్దని తల్లి మందలించిందన్న చిన్నకారణంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇదీ చూడండి: జలాశయంలో మునిగి ఐదుగురు దుర్మరణం