ఏపీలో విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి చెందారు. అయితే బంధువులు ఆక్సిజన్ కొరత కారణంగా.. చనిపోయారని చెబుతుండగా.. ఆక్సిజన్ కొరతతో చనిపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సంఘటనపై మెుదట స్పందించని అధికారులు తర్వాత వివరణ ఇచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు ఆక్సిజన్ అయిపోయిందని.. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో ఐసోలేషన్‌లో ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న బాధితులు అస్వస్థతకు గురయ్యారని మెుదట వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిపై ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో పాటు బాధితుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ కొరత కాదు..
ఈ ఘటనపై కలెక్టర్ హరి జవహర్‌లాల్ మీడియా సమావేశం నిర్వహంచారు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పారని తెలిపారు. కరోనా వల్లే ఇద్దరు చనిపోయారని వైద్యులు నిర్ధరించారని కలెక్టర్ వెల్లడించారు. మహారాజ ఆస్పత్రిలో 290 మంది కొవిడ్ రోగులు ఉన్నారన్న కలెక్టర్.. 25 మంది రోగులకే ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు. లోప్రెజర్‌లో ఆక్సిజన్ సరఫరా అవుతోందని.. దీనికి కారణమేంటో నిపుణులు చూస్తున్నారన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విశాఖ, పైడిభీమవరం నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పిస్తున్నామన్నారు. మధ్యాహ్నం వరకు పరిస్థితి చూసి రోగులను విశాఖకు తరలిస్తామని కలెక్టర్ హరిజవహర్‌లాల్ స్పష్టం చేశారు.