ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వాహనదారులను పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాహనాలను స్వాధీన పరుచుకుంటున్నారు. కాకతీయ వైద్య కళాశాలలో రూ.1.72 లక్షలతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల కరోనా కేసుల పరీక్షలు ఇక్కడ నిర్వహించనున్నారు.
రోజుకు వంద నమూనాల పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని మంత్రులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులనూ పట్టించుకోకుండా... కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోందన్నారు. ప్రజలు కూడా సహకరించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సమయంలో పేదవారెవరూ పస్తులుండకూడదని... ముఖ్యమంత్రి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి పీహెచ్‌సీలలోని ఏఎన్‌ఎం, ఆశావర్కర్లకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యవసర వస్తువులు, కూరగాయలను 'సేవా భారత' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు