టెక్నాలజీలోనే కాదు క్రీడా సమరంలోనూ యువత సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ ఆ తరువాత జరిగిన పారా ఒలింపిక్స్.. యువ క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో స్ఫూర్తి రగిలించారు. అలా దేశవ్యాప్తంగా క్రీడల హవా నడుస్తున్న సమయంలోనే జాతీయ అథ్లెటిక్స్ పోటీలతో వరంగల్ నగరం క్రీడాభిమానుల్ని తనవైపునకు తిప్పుకుంది.
తొలిసారిగా జాతీయ స్థాయిపోటీలు..
హనుమకొండ జవహర్లాల్ నెహ్రు మైదానం తొలిసారిగా జాతీయ అథ్లెటిక్ ఓపెన్ చాంఫియన్ షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో... జిల్లా అథ్లెటిక్ సంఘం ఈ నెల 15 నుంచి 19 వరకు పోటీలు నిర్వహించింది. పతకాల వేటలో... ట్రాక్‌పై క్రీడాకారులు చిరుతల్లా పరుగులు పెట్టారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 573 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విభిన్న భాషలు, విభిన్న నేపథ్యాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, వారిని చూడటానికి వచ్చిన అభిమానులతో... మైదానం సందడిగా మారింది. మెుత్తంగా ఈ క్రీడల్లో...రైల్వేస్, సర్వీసెస్, ఆల్ ఇండియా పోలీస్ విభాగాల క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలిచ్చారు.
తెలంగాణకు ఒక కాంస్య పతకం..
5 రోజుల్లో రైల్వేస్ 36 పతకాలు సాధించి... అగ్రస్థానంలో నిలిచింది. 157 పాయింట్లతో ఓవరాల్ చాంఫియన్ షిప్‌ను రైల్వే క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. 30 పతకాలతో సర్వీసెస్, 16 పతకాలతో తమిళనాడు ఆ తరువాతి స్థానంలో నిలిచాయి. హరియాణా 15, పంజాబ్ 12 పతకాలతో 5,6 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే..ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు, ఒక కాంస్య పతకం సాధించగా....తెలంగాణ ఒక కాంస్య పతకం గెలుచుకుంది.
ఇంత మంది క్రీడాకారులు... కోచ్‌లు, వారి స్నేహితులు అలా... వేల మందితో వరంగల్ నగరం కొత్త సందడిని సంతరించుకుంది. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో నిర్వాహకులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 72 గంటలు ముందుగా కొవిడ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ సర్టిఫికేట్ ఉంటేనే క్రీడా ప్రాంగణంలోకి అనుమతిచ్చారు.
ఇవీచూడండి: IPL2021 News: జోరు మీద దిల్లీ.. కసితో సన్‌రైజర్స్!