కరోనా కారణంగా గత ఏడాది కాలంగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని తెలంగాణా ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్(టాప్టా) డిమాండ్ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి దీక్షలో కూర్చుని వారికి మద్దతు తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని తెలిపారు.
కరోనా కాలంలో వేతనాలు లేక... కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నామని టాప్టా వ్యవస్థాపక అధ్యక్షుడు చందర్ లాల్ నాయక్ చౌహన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 45 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల కోసం పట్టభద్రుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులను ప్రశ్నించాలని కోరారు. పట్టభద్రులను తయారు చేసింది కూడా ఉపాధ్యాయులే అని గుర్తు చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి : హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి : మంత్రి కేటీఆర్