ఏర్పాట్లు అంతంతమాత్రమే...
దేవస్థానానికి వివిధ వనరుల ద్వారా ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా భక్తులకు కనీస వసతులు కరవయ్యాయి. తాగునీరు, మరుగుదొడ్లు, మురుగు కాలువలు తదితర సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా ఇదే పునరావృతం అవుతోంది. ఫలితంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అధికంగా కేటాయించినప్పటికీ... ఏర్పాట్లు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి.
సంక్రాంతితో మొదలుకొని ఉగాది వరకూ...
ఏటా జాతరకు వారం ముందే నిర్వహించే దృష్టి కుంభంతో జాతర మొదలవుతుంది. కానీ ఈ ఏడాది 20 రోజుల ముందే దృష్టి కుంభం నిర్వహించారు. సంక్రాంతికి రెండురోజుల ముందు ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు మొదలై ఉగాది వరకూ కొనసాగుతాయి.
- 13న - ధ్వజరోహణం, నూతన వస్త్రాలంకరణ, పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
- 14న భోగి రోజు - స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరానున్న లక్షలాది భక్తులు
- 15న మకర సంక్రాంతి - ఎండ్లబండ్లతో భక్తులు గుడిచుట్టూ భక్తుల ప్రదక్షిణల నిర్వహణ
- 17న -మహా సంప్రోక్షణ( ఉదయం 7 నుంచి 4 గంటల వరకు)
- 30న- అమ్మవారి పంచమ వార్షికోత్సవం, విశేష అభిషేకము, చండీయాగము, మహానివేదన కార్యక్రమాలు
- ఫిబ్రవరి 9న - రేణుక ఎల్లమ్మ పండుగ నిర్వహణ, అమ్మవారికి అభిషేకం, నూతన వస్త్రాలంకరణ, సహస్ర కుంకుమార్చన
- ఫిబ్రవరి 19 -23 వరకు- శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు
15 లక్షలకు పైగా రానున్న భక్తులు
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈసారి 15 లక్షలకు పైగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది పది లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈసారి అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.
నూతన శోభ...
ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, క్యూలైన్లు, విద్యుత్ కాంతులతో స్వామి వారి సన్నిధి కళకళలాడుతోంది. లోపల ఆహ్లాదాన్ని అందించే వివిధ ప్రదర్శన శాలలు ఏర్పాటు కావడంతో ఆలయ ప్రాంగణం నూతన శోభను సంతరించుకుంది. అధికారులు సమస్యలను తీర్చేవిధంగా చర్యలు తీసుకుంటే మంచిదని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'పృథ్వీరాజ్ అసభ్య సంభాషణ ఆడియో టేపుల విడుదల'