నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించడానికి కారణం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడమే. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తోపాటు నిజాం షుగర్స్ పునరుద్ధరించాలంటూ చెరుకు రైతులూ పోటీ చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారటం వల్ల ఎన్నికల్లో ప్రధానాంశమైంది.
1938లో నిజాం షుగర్స్ ఏర్పాటైంది. 16వేల ఎకరాల్లో చెరుకు సాగు చేసి పరిశ్రమ నడిపించేవారు. కాల క్రమేణా ఆసక్తిగా రైతులే చెరుకు ఉత్పత్తి చేయటం వల్ల సంస్థ పరిధి విస్తరించింది. నష్టాలు వస్తున్నాయంటూ ప్రభుత్వం 2002లో ప్రైవేటీకరణ చేసింది. తర్వాత తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వం, ప్రైవేటు ఆధీనంలో లేకుండా... రెంటికి చెడ్డ రేవడి అయ్యింది. 2004లో హౌస్ కమిటీ వేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినా... ఆచరణ సాధ్యపడలేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ... ప్రత్యేక రాష్ట్రంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంతవరకు వాగ్ధానాలు నెరవేరలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
2015లో యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. అప్పటినుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. బకాయిలు చెల్లించి ఆదుకోవాలని ఎప్పటికప్పుడు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా చెరకు సాగు చేసేందుకు ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని రైతులు వేడుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాక్టరీ అంశాన్నే అన్ని పార్టీలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. మరి ఈసారైనా హామీలు అమలవుతాయో లేదో చూడాలి.
ఇవీ చూడండి: గ్రేటర్‌పై కేటీఆర్ నజర్... కారణాలివే!