నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయాన్ని బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. కరోనా కాలంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వెంకట్ డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అలాగే కార్మికుల పీఎఫ్ అకౌంట్లను సరిచేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని.. లేకపోతే సమ్మె నోటీసు ఇస్తామని కార్మికులు హెచ్చరించారు.