Lumpy skin disease in Telangana: రాష్ట్రంలోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యాధితో లక్షల్లో పశువులు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోనూ లంపీస్కిన్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ వ్యాధి.. ఆవు, గేదె జాతి పశువుల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది.
తాజాగా నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మండలంలోని తుంగిని, నలేశ్వర్ గ్రామాల్లో 5 ఆవులకు గడ్డలు కనిపిస్తున్నాయని రైతులు పశు వైద్య అధికారికి సమాచారం అందించారు. పరిశీలించిన వైద్యాధికారులు లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఆవుల నుంచి రక్త నమునాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఎల్లారెడ్డిలో ఈ వ్యాధి లక్షణాలతో లేగ దూడ మృతి చెందింది. నందిపేట్, బాన్సువాడల్లోనూ పశువులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.
గద్వాల జిల్లాలో మూడు ఎద్దులు మృతి.. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులను లంపీ స్కిన్ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఈ రోగ లక్షణాలతో మూడు ఎద్దులు మృత్యువాత పడటం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. 20 రోజుల కిందట రాజోలి మండలంలో ఓ ఎద్దు ఇదే రోగంతో మృతి చెందిందని పశువైద్య అధికారులు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువులకు ఈ వ్యాధి సోకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,502 పశువులకు లంపీస్కిన్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు గుర్తించారు.
జిల్లాలో 70 వేల పశువులు ఉన్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిలో 50 వేల పశువులకు టీకాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. మిగతా వాటికి సోమవారం నుంచి ఇస్తామని పేర్కొన్నారు. పశువులకు జ్వర లక్షణాలు ఉంటే మొదటి రోజే పశు వైద్యశాలకు తీసుకొని వస్తే వెంటనే ఈ వ్యాధిని నివారించవచ్చన్నారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు జిల్లాలో మూడు ఎద్దులు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: