నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంఠేశ్వర్ రైల్వే కమాన్ కింద మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే కమాన్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నార్త్ తహసీల్దార్ కార్యాలయం వరకు నీళ్లు నిలిచిపోయాయి. బోధన్ రోడ్డు, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
జిల్లా వ్యాప్తంగా జోరు వాన...
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. నిజామాబాద్‌తోపాటు నందిపేట్, చందూర్, మోస్రా, బోధన్, బాల్కొండ, మెండోరా, రుద్రూర్, ఎడపల్లి, దర్పల్లి, డిచ్పల్లి, సిరికొండ తదితర మండలాల్లో వర్షం పడుతోంది. జిల్లాలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలు చోట్ల అలుగు పోస్తున్నాయి. పంట పొలాల్లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని లోటట్టు గ్రామాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు...
జోరు వానలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో లక్షా 83 వేల 883 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. భారీ స్థాయిలో వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రాజెక్టు అధికారులతో సంప్రదిస్తూ.. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రాజెక్టులో రోజుకు మూడు అడుగుల చొప్పున నీటి మట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 1083 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.