ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పంపిస్తానని... నిజామాబాద్ జిల్లాలో ఓ ఏజెంట్ భారీగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం ఉడాయించాడు. డబ్బులు చెల్లించిన యువకులంతా నిజామాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్మూర్‌కు చెందిన ఓ ఏజెంట్ ఏడాదిన్నర కింద దుబాయి, బహ్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు పంపిస్తానని సుమారు 50 మంది వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్కరి నుంచి 60 వేల నుంచి లక్షన్నర వరకు వసూలు చేశాడు. నకిలీ వీసాలు, నియామక పత్రాలు చేతిలో పెట్టాడు. బాధితులు పదే పదే అడగడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. వేచి చూసి విసిగిపోయిన యువకులు పాలనాధికారిని ఆశ్రయించారు. బాధితుల్లో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లా యువకులు ఉన్నారు.