యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. వందశాతం రాతి కట్టడాలతో, పూర్తిగా కృష్ణశిలలతో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. కొండపై విశాలంగా మాడవీధులు, ప్రాకారాలు, గోపురాలతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ప్రధానాలయం పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ప్రసాదం కాంప్లెక్స్ కూడా సిద్ధమైంది. శివాలయం పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇటీవల యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆలయ పనులకు సంబంధించి తుదిమెరుగులు దిద్దేలా అవసరమైన సూచనలు చేశారు. ఇత్తడితో క్యూలైన్లు, రెయిలింగ్, ప్రహరీగోడలకు సంబంధించి చేయాల్సిన పనులపై దిశానిర్ధేశం చేశారు. ఆ పనులన్నీ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అవన్నీ పూర్తవుతాయని అంటున్నారు.
వేగంగా విద్ద్యుదీకరణ పనులు..
కొండపై అభివృద్ధి చేసిన విష్ణు పుష్కరిణిని కొద్దిగా విస్తరిస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడ పనులు కూడా పూర్తి కానున్నాయి. గుట్టపై బస్సులు వచ్చి పోయేందుకు వీలుగా అభివృద్ధి చేస్తున్న బస్టాండ్ పనులు కొనసాగుతున్నాయి. కొండపై విద్యుత్ దీపాల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. పూర్తిగా వెలుగులు విరజిమ్మేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణాల చుట్టూ, పరిసరాలు దివ్యమైన వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం గతంలోనే పరిశీలించారు. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి.
తుదిదశకు పుష్కరిణి పనులు
కొండపై ప్రసాదం కాంప్లెక్స్‌ను లక్ష మంది రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశారు. రోజుకు లక్ష మంది వచ్చినా ఒక్కొక్కరికి పది చొప్పున పది లక్షల చొప్పున లడ్డూలు అందించేలా హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నిర్వహణ జరగనుంది. త్వరలోనే ప్రసాదం కాంప్లెక్స్‌లో ట్రయల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొండ కింద పుష్కరిణి పనులు తుదిదశలో ఉన్నాయి. కళ్యాణకట్ట కోసం దీక్షాపరుల మండపాన్ని ఉపయోగించనున్నారు. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పురోగతిని తెలుసుకుంటున్నారు.
మే లో స్వామివారి దర్శనం..
మే నెలలో శుభముహూర్తాలు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో స్వామి వారి ఆలయాన్ని పునఃప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నృసింహజయంతి కూడా అదే నెలలో ఉంది. సుదర్శనయాగం నిర్వహించే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు యాగం నిర్వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి మే నెలలో నాలుగైదు ముహూర్తాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈలోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీ చూడండి: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ అత్యుత్తమ అవార్డు