భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా భాజపా, తెరాస కార్యకర్తలపై కేసులు నమోదుచేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. సోమవారం నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్లు తెలిపారు.
బండి సంజయ్ నల్గొండ జిల్లాలోని ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో తెరాస శ్రేణులు ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నంలో స్వల్ప లాఠీఛార్జీ జరిగినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఇలాంటి సమయంలో బండి సంజయ్ పోలీసుల అనుమతి తీసుకోకుండా.. చివరి నిమిషంలో జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత లేఖను ఇచ్చారని ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.
నల్గొండ పట్టణం శివారులోని ఆర్జలా బావి ఐకేపీ కేంద్రం వద్ద పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి చోటా ఉద్రిక్తతలు జరిగాయన్నారు. ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా ఉన్న సిబ్బందితోనే బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చిందని ఎస్పీ తెలిపారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్లు, రాళ్లు, టమాటాలతో దాడి జరుగుతోందని తెలిసి ఉన్న కొంచెం సిబ్బందితోనే రక్షణ కల్పించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రాజకీయ నేతలు, ఇతరులు.. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ఎస్పీ రంగనాథ్ సూచించారు.
ఘర్షణ వేళ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌కు గుండెపోటు..
బండి సంజయ్ పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణ వేళ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది.. సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.
అడుగడుగునా ఉద్రిక్తత...
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం బండి సంజయ్ చేపట్టిన యాత్ర(bandi sanjay nalgonda tour) రణరంగంగా మారింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో... తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ(trs vs bjp) ఏర్పడింది. మిర్యాలగూడ రాళ్ల దాడిలో పలువురికి గాయాలు కాగా... నేరేడుచర్లలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సంజయ్ రాక(bandi sanjay latest news) పట్ల నిరసన తెలియజేస్తామని ముందుగానే ప్రకటించిన తెరాస శ్రేణులు(trs vs bjp) అడుగడుగునా ఆయన్ను అడ్డుకున్నాయి. పరస్పర నినాదాలు, కోడిగుడ్లు, రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి విధ్వంసకరంగా మారింది. మిర్యాలగూడ, శెట్టిపాలెం, చిల్లేపల్లి వంతెన, నేరేడుచర్ల, గరిడేపల్లి, గడ్డిపల్లి ఇలా ప్రతి చోటా భారీగా తెరాస శ్రేణులు.. బండి కాన్వాయ్‌ను అడ్డుకుంటూ ఆందోళనలు చేశారు. సోమవారం రాత్రి బండి సంజయ్ సూర్యాపేట చేరుకునే వరకూ నిరసనలు ఆగలేదు.
ఇవీచూడండి: