Munugode by election laborers were not available for agriculture: మునుగోడు ఉప ఎన్నికతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత వారం, పది రోజులుగా సందడి నెలకొంది. సాధారణ రోజుల్లో చిన్న కారు కూడా కనపడని గ్రామాల్లోనూ ఇప్పుడు నిత్యం వందల సంఖ్యలో కొత్తకొత్త మోడళ్ల కార్లు దర్శనమిస్తున్నాయి. ఏటా ఈ సమయంలో పత్తి, వరి కోతల పనులతో తలమునకలయ్యే వ్యవసాయ కూలీలు ఈ దఫా ప్రచారంలో నిమగ్నమయ్యారు. సాధారణంగా వరి, పత్తి కోతలు జరిగే ఈ కాలంలో మధ్యాహ్నం గ్రామాల్లోకి వెళ్తే వృద్ధులు మాత్రమే కన్పించేవారని, ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన పార్టీలకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కన్పిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
ఉదాహరణకు మునుగోడు మండలం పలివెల గ్రామంలో సుమారు 2,300 ఓటర్లు ఉండగా 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వారంతా ఏటా ఈ సమయంలో పొలం పనుల్లో తలమునకలయ్యేవారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరుకునే వారు. ఇప్పుడు మాత్రం పొలం పనులను పక్కనపెట్టేశారు. మరో వారం పది రోజుల్లో పత్తితీత పనులు మొదలు కావాల్సి ఉంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కూలీలను మాట్లాడుకుందామని వారం రోజులుగా తిరుగుతున్నాను ఎక్కడా ఎవరు దొరకడం లేదని పలివెల గ్రామానికి చెందిన రైతు యాదయ్య పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వచ్చే కూలీలకు రోజు రూ.400 వరకు ఇచ్చేవాళ్లమని, ఇప్పుడు ప్రధాన పార్టీల ప్రచారానికి వెళితే రూ.500 వరకు ఇస్తున్నారని మరో రైతు వాపోయాడు. మధ్యాహ్నం బిరియానీ, తాగే వారికి మద్యం సీసాలు అదనమని, దీంతో వ్యవసాయ కూలీలంతా ఎన్నికల ప్రచారం వైపే మొగ్గుచూపుతున్నామని తెలిపాడు. పనులకు పిలిచినా వచ్చే వారు కన్పించడం లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పత్తితీత పనులనూ పక్కనపెట్టేశామని పేర్కొన్నారు.
నెమ్మదించిన స్థిరాస్తి వ్యాపారం.. రాజధానికి దగ్గరగా ఉన్న చౌటుప్పల్, నారాయణపూర్‌తోపాటు మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో వెంచర్లు ఎక్కువ. సాధారణ రోజుల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగేది. చౌటుప్పల్ పరిసరాల్లోని వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు హైదరాబాద్‌లోని హయత్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు వచ్చి ధరలపై ఆరా తీసేవారు. గత పక్షం రోజులుగా స్థిరాస్తి వ్యాపారం కళ కోల్పోయిందని, అందరూ ఉప ఎన్నిక ప్రచారాల్లో ఉండటంతో వెంచర్లలోని ప్లాట్లను చూసేవారే కరవయ్యారని’ చౌటుప్పల్ మండలం కోయలగూడెంకు చెందిన స్థిరాస్తి వ్యాపారి శివప్రసాద్ తెలిపారు.
ఎటుచూసినా తెల్ల చొక్కాలే.. సాధారణంగా గ్రామాల్లో కార్లు కన్పించడం అరుదు. ఇప్పుడు వెయ్యి ఓట్లున్న పల్లెలోనూ రోజూ 150 వరకు కార్లు తిరుగుతున్నాయి. చిన్న రహదారులపై పెద్దపెద్ద కార్లు తిరుగుతుండటంతో పల్లెల్లో కొత్త సందడి నెలకొందని గ్రామీణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్క పలివెల గ్రామంలోనే అన్ని పార్టీల నాయకులు, వారి అనుచరులు కలిపి సుమారు రెండు వేల మంది వరకు మకాం వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అక్కడే నివాసం ఉంటుండగా...మరికొందరు రోజూ హైదరాబాద్‌తోపాటు నల్గొండ నుంచి రాకపోకలు సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో సుమారు 1,300 మంది ఓటర్లు ఉండగా, అక్కడా అదే పరిస్థితి ఉంది.
ఇవీ చదవండి: