రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనాకు రక్షణగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. దీంతో ప్రస్తుతం మాస్కులకు డిమాండ్ పెరిగింది. కొరతను అధిగమించేందుకు మహిళా సంఘాలు (గ్రామైక్య సంఘాలు) ముందుకొచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు మాస్కుల తయారీలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వారిని ప్రోత్సహిస్తున్నాయి.
సెర్ప్ నుంచి నిధులు
రాష్ట్ర వ్యాప్తంగా మాస్కుల తయారీకి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రూ.2.5 కోట్లు సమకూర్చనుంది. అందులో ఉమ్మడి జిల్లాకు రూ.20 లక్షలు రానున్నాయి. నల్గొండ జిల్లాకు రూ.10 లక్షలు, సూర్యాపేటకు రూ.5 లక్షలు, యాదాద్రి భువనగిరికి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. ఈ నిధులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన వస్త్రాన్ని వినియోగించి, మాస్కులను తయారు చేయించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 64 వేల మాస్కులు తయారు చేయించారు. సెర్ప్ నిధులతో మరో 2 లక్షలకు పైగా మాస్కులను తయారు చేయించనున్నారు. జిల్లా పాలనాధికారుల పరిశీలనలో మాస్కులు తయారు కానున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మాస్కుల తయారీ ద్వారా ఆదాయం సమకూరుతుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ ద్వారా మాస్కుల ఉచిత పంపిణీ
స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన మాస్కులను పంచాయతీ నిధులతో కొనుగోలు చేసి గ్రామాల్లో ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో మాస్కుకు రూ.15 వరకు మహిళా సంఘాలకు చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు.
రోజుకు 20 తయారు చేస్తున్నా..
-సంతోష, రాములబండ, నల్గొండ
కుట్ట పని రావడం వల్ల నాలుగు రోజులుగా రోజుకు 20 మాస్కుల చొప్పున తయారీ చేస్తున్న. ఒక్కోటి రూ.15కు విక్రయిస్తున్న. ఇతర పనులు లేని ఈ సమయంలో రోజుకు రూ.300 ఆదాయం వస్తోంది.
ఇదీ చూడండి: కరోనా కాలంలో కొత్త భయం- ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు