Munugode By Poll: మునుగోడు ఉపఎన్నిక సమరంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న రాజకీయాలు పార్టీలు.. ఇక రణక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు భాజపా అధిష్ఠానం అధికారికంగా వెల్లడించింది. ఉప ఎన్నికలో వేయాల్సిన ఎత్తులు, ప్రచార ప్రణాళికలు రచిస్తున్న కమలదళం.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న 3 ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్.. నాటి నుంచి భాజపా పట్ల సానుకూల ధోరణితో ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఆగస్టు 7న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 21న మునుగోడులో జరిగిన బహిరంగసభలో అమిత్‌షా సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది.
కసరత్తులు మొదలుపెట్టిన కమలదళం.. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండగా.. అధికార తెరాస ఓటు బ్యాంకు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు కలిసొచ్చే అవకాశం ఉన్నాయి. తొలి నుంచి ఈ నియోజకవర్గంలో మూడో స్థానంలోనైనా నిలువని భాజపాకు.. రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వమే ప్రధాన బలం కానుంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఏయే అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశాలపై కమలదళం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్, సునీల్‌బన్సల్‌తో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు లక్ష్మణ్, ఈటల, వివేక్, విజయశాంతి తదితరులు ఈ భేటీకి హాజరుకాగా.. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
తెరాస, కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదంతో.. మునుగోడులో భాజపా విజయం సాధించేలా కృషి చేయాలని తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరారంటూ ప్రత్యర్థి తెరాస, కాంగ్రెస్‌లు చేస్తున్న ప్రచారంపై కమలదళం ఎదురుదాడి చేస్తూ వస్తోంది. తెరాస ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అభివృద్ధి కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారనే అంశాలను ప్రధాన అస్త్రాలుగా తీసుకుంటున్న కమలం పార్టీ.. రాష్ట్ర సర్కార్ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా తెరాస, కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదాన్ని ఎత్తుకుంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంతో ఉన్న భాజపా.. ఇదే ఊపును మునుగోడులో కొనసాగించి.. రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అనే సంకేతాలివ్వాలని భావిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా జాతీయ నేతల ప్రచారం, బహిరంగ సభల కోసం ప్రణాళికలు రచిస్తోంది.
ఇవీ చదవండి: