1952లో ఏర్పడిన మెదక్ పార్లమెంటుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1980లో ఇక్కడి నుంచి గెలిచి ఇందిరాగాంధీ ప్రధాని పీఠమెక్కారు. కేసీఆర్ కూడా 2014లో భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి అయ్యాక రాజీమానా చేసి గజ్వేల్ శాసనసభ్యులుగా కొనసాగారు. మెతుకు సీమ చరిత్రలో మొదటి ఉపఎన్నికల్లో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి...మరోసారి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున గాలి అనిల్ కుమార్, భాజపా నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.
మెదక్ పార్లమెంటుకు 17సార్లు ఎన్నికలు జరగగా... 9సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మధ్యలో తెలంగాణ ప్రజాసమితి, తెలుగుదేశం చెరోసారి, 1999లో భాజపా గెలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో పరిస్థితి మారిపోయింది. 2004 నుంచి వరుస విజయాలతో... గులాబీ పార్టీ దూసుపోతోంది. ఇక్కడ 16 లక్షల 2వేల 947 ఓటర్లుండగా...ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 7లక్షల 21వేల 443, కాంగ్రెస్కు 3 లక్షల 78వేల 820, భాజపాకు 59వేల 579 ఓట్లు పోలయ్యాయి.
తెరాస అభివృద్ధి మంత్రం
కేసీఆర్ అనుచరుడిగా 2014 ఉపఎన్నికలతో కొత్త ప్రభాకర్ రెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచారు. దశాబ్దాల హామీగా ఉన్న అక్కన్నపేట-మెదక్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సాధించారు. హైదరాబాద్-మెదక్, సంగారెడ్డి-గజ్వేల్-చిట్యాల మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారులుగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. లోక్సభ పరిధిలో 6అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం అదనపు బలంగా కనిపిస్తోంది. తెరాస ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కలిసొస్తాయని ఆశిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, దత్తత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు ప్రతికూలాంశాలు.
చరిత్రపై నమ్మకంతో కాంగ్రెస్
అత్యధిక పర్యాయాలు గెలిచిన కాంగ్రెస్ మరోసారి ఇక్కడ విజయభేరీ మోగించాలని ఆశిస్తోంది. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న గాలి అనిల్ కుమార్ను బరిలో దింపింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన అనిల్... సరైన గుర్తింపు లేదని కారు దిగి చేయందుకున్నారు. సామాజిక సేవ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఏసీతో సత్సంబంధాలు, మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ చేసిన అభివృద్ధి కలిసొస్తాయని భావిస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయలోపం, సీనియర్ నేతలు పార్టీని వీడటం ప్రతికూలాంశాలుగా మారనున్నాయి.
ఉద్యమ నినాదంతో భాజపా
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రఘునందన్ రావు భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్థానిక సమస్యలపై పట్టు, స్థానికంగా న్యాయవాదిగా గుర్తింపు, మోదీ మానియా అనుకూలాంశాలుగా భావిస్తున్నారు. దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినందున సానుభూతి కలిసొస్తుందని ఆశిస్తున్నారు. పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, లోక్సభ పరిధిలో ఏ అసెంబ్లీ స్థానంలోనూ డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం బలహీనతలుగా కనిపిస్తున్నాయి.
అత్యధిక మెజారిటీతో చరిత్ర సృష్టిస్తామని తెరాస... ఇందిరమ్మ రోజులు పునరావృతమవుతాయని కాంగ్రెస్... మోదీ ఇమేజ్ కలిసొస్తుందని భాజపా ధీమాగా ఉన్నాయి.
ఇవీ చూడండి: గిరిజన కోటాలో గిరిజనేతరులే కీలకం