Chain Snatchers Hulchal: మంచిర్యాలలో ఇద్దరు చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే ప్రాంతంలో రెండు సార్లు గొలుసు దొంగతనానికి యత్నించగా.. మొదటిసారి సఫలమై.. రెండోసారి విఫలమయ్యారు. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పట్టణంలోని సాయిహనుమాన్ నగర్‌కు చెందిన రమాదేవి.. స్థానికంగా ఉన్న బ్యాంకుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. ఓ వ్యక్తి మాటు వేసి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించి పరుగెత్తాడు. అక్కడే ద్విచక్రవాహనంపై ఉన్న మరో యువకుడితో కలిసి పరారయ్యారు.
అదే రోడ్డులో.. అదే స్టైల్లో..
ఈ ఘటన జరిగిన మూడు గంటల వ్యవధిలోనే అదే స్థలంలో ఈ దుండగులే మళ్లీ చైన్‌స్నాచింగ్‌కు ప్రయత్నించారు. మొదటిసారి విజయవంతం కావటంతో అదే స్టైల్లో మరోసారి దొంగతనం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తులసీ అనే స్థానికురాలిని వెంబడించి.. మెడలో నుంచి బంగారు గొలుసును లాగేందుకు ఓ యువకుడు యత్నించాడు. ఈసారి అనుకున్నట్టు జరగలేదు. కొంచెం గురి తప్పటంతో.. చేతికి గొలుసురాకపోగా ఆ మహిళ దుండగున్ని పట్టుకునేందుకు యత్నించింది. ఆమె నుంచి తప్పించుకున్న నిందితుడు.. అప్పటికే ద్విచక్రవాహనం మీద సిద్ధంగా ఉన్న మరో యువకునితో కలిసి పరారయ్యారు.
నిఘా నేత్రంలో నిక్షిప్తం..
ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
ఇదీ చూడండి: