Road War: ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం నుంచి రామన్నపేట, కామంచికల్ మీదుగా రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లి వరకు ఉన్న రహదారిని... రెండు వరుసల రోడ్డు విస్తరణతోపాటు కల్వర్టుల వెడల్పుల కోసం ప్రభుత్వం 33 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. మొత్తం 14 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు... రెండు నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్యంతో అతీగతీ లేకుండా పోయాయి. రహదారి విస్తరణ పనులు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండటటమే వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దానవాయిగూడెం నుంచి కామంచికల్ వరకు పాలేరు నియోజకవర్గంలో ఉంది.
టెండర్లు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు..
ఖమ్మం నియోజకవర్గంలో పాపటపల్లి ఉంది. దీంతో.. ఈ రహదారి విస్తరణ పనుల టెండర్లు దక్కించుకునేందుకు ఎవరికి వారే విశ్వ ప్రయత్నాలు చేశారు. వాస్తవంగా అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టు పనులు నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్న వారికే దక్కుతున్నాయి. దీంతో.. ఓ నియోజకవర్గానికి చెందిన సదరు ప్రజాప్రతినిధి తాను చెప్పిన వారికే సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈలోగా టెండర్ వేసేందుకు సమాయత్తమైన మరో గుత్తేదారు అధికార పార్టీకి చెందిన మరో నియోజకవర్గం నేతల సహకారంతో రంగంలోకి దిగారు. ఆర్ అండ్ బీ అధికారులను సంప్రదించి తనకే సర్టిఫికెట్ ఇవ్వాలని.. ఒత్తిడి తీసుకురావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య చిచ్చు..
ఇదే విషయం రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య చిచ్చురాజేసింది. ఇలా మొదటి సారి టెండర్లు రద్దయ్యాయి. రెండోసారి టెండర్లు ఆహ్వానించగా..మొత్తం ఆరు దాఖలయ్యాయి. దీంతో ఎలాగైనా తమ గుత్తేదారుకే దక్కించుకునేలా నేతలు పావులు కదిపినట్లు తెలిసింది. ఇందుకోసం భారీ మొత్తమే చేతులు మారినట్లు సమాచారం. అయితే..టెండర్ దక్కించుకునేందుకు ఇంకో నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతలూ తీవ్ర ప్రయత్నాలు చేశారు. రహదారి విస్తరణ పనుల్లో అధికార పార్టీ నేతల మధ్య పంచాయితీ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వద్దకు చేరింది. తన నియోజకవర్గంలో ఎక్కువ రహదారి పనులు చేపట్టాల్సి ఉన్నందున... తాను చెప్పిన వారికే పనులు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కేవలం 14 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు.. పార్టీ నేతల మధ్య తగువు పెరుగుతాయేమోనని భావించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి చివరకు టెండర్లను మళ్లీ రద్దు చేశారు. ప్రస్తుతానికి మళ్లీ టెండర్లు ఆహ్వానించలేదు. ఈ పరిస్థితి కారణంగా నిధులు మంజూరైనా... రోడ్డు విస్తరణకు పనులు మొదలుకాకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు మోక్షం కలుగుతుందో..
ఇలా అధికార పార్టీ గ్రూపుల పంచాయితీతో ఆర్ అండ్ బీ అధికారులు చుక్కలు చూస్తున్నారు. ఎవరికి మద్దతు పలకాలో తెలియక అయోమయానికి గువుతున్నారు. అధికార పార్టీ గ్రూపు పంచాయితీలతో నిలిచిపోయిన రహదారి అభివృద్ధి పనులకు మళ్లీ ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: