మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మందితో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం టైరు పేలిపోవడం వల్ల అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో అందులో ప్రయాణిస్తున్నవారంతా తీవ్రంగా గాయపడ్డారు.
దైవదర్శనానికి వెళ్తూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి శివారు కొత్త తండా వాసులు తిరుపతి యాత్రకు బయలుదేరారు. 30 మందికి పైగా ప్రయాణమయ్యారు. వీరంతా బొలెరో వాహనంలో కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయినందున అదే వాహనంలో మహబూబాబాద్‌కు వచ్చి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వెళ్లాలనుకున్నారు.
అతివేగమే కారణం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలిపోయింది. అదుపు తప్పిన వాహనం పల్టీ కొట్టింది. వాహనం అతివేగంగా నడపొద్దని చెప్పినప్పటికీ డ్రైవర్ వినలేదని అందువల్లే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు.
ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ప్రధానాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద వార్త తెలిసి వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: నడిరోడ్డు మీద ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి