ఖడ్గాన్ని చేతబట్టి... కిరీటాన్ని ధరించి శ్రీరాముడు రాజ్యాధికారం చేపట్టాడు. ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాల్లో రాములవారు రారాజుగా మెరిసిపోయారు. భక్తులకు ప్రవేశ అనుమతి లేనందున ఎదుర్కోలు, కల్యాణ మహోత్సవాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. భద్రాచలం ఉత్సవాల్లో చివరి, ప్రధాన ఘట్టమైన శ్రీరాముల పట్టాభిషేక వేడుక వైభవంగా సాగింది. సీతాదేవితో కలిసి శ్రీరాముడు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. వైదిక పెద్దలు, కొంతమంది ప్రభుత్వ ప్రముఖుల సమక్షంలో పట్టాభిషేక మహోత్సవం పూర్తయింది.
స్వామి వారికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు పట్టాభిషేక క్రతువు విశిష్టతను వివరించారు. మహాపట్టాభిషేక మహోత్సవం తర్వాత ఆనవాయితీగా నిర్వహించే తిరువీధి సేవ కూడా లాక్డౌన్ ఆంక్షల కారణంగా రద్దు చేశారు.
ఇదీ చూడండి : ఖమ్మం మిర్చి గిడ్డంగుల ముందు రైతుల నిరీక్షణ