ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని కంకర రాళ్ల క్వారీలో ఉపయోగిస్తోన్న పేలుడు పదార్థాల ధాటికి స్థానిక ప్రజలు భయంతో గడుపుతున్నారు. భయంకరమైన శబ్ధాలకు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని, ఆస్‌బెస్టాస్ పైకప్పులు పగిలి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం నగర శివారు 7వ డివిజన్‌లోని కొత్తగూడెం సమీపంలోని సైదులగుట్ట క్వారీలో రాళ్లను పేల్చేందుకు బరాలు పెడుతున్నారు. రోజూ రాత్రి 7 గంటల నుంచి 9గంటల మధ్యలో పెద్ద పెద్ద శబ్ధాలతో బాంబులు పేల్చుతున్నారు. 2002 నుంచి క్వారీకి అనుమతులు తీసుకున్న వ్యక్తులు గుట్టను పేల్చి కంకరను తయారు చేస్తున్నారు. రాళ్లను పగుల కోట్టేందుకు వాటిని పేల్చే క్రమంలో భారీ శబ్ధాలు వస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బాంబులు పేల్చే సమయంలో పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం, అల్లీపురం, శ్రీరాంనగర్, ముస్తఫానగర్ పరిసర ప్రాంతాల ప్రజలు శబ్ధాలతో బేంబేలు ఎత్తిపోతున్నారు. భారీ బాంబులు పేల్చటంతో భూమి సైతం కంపిస్తుందంటూ చెబుతున్నారు. విస్ఫోటనాలకు కొత్తగా నిర్మించిన గోడలు సైతం పగిలి బీటలు వచ్చాయని పేర్కొంటున్నారు. ఇళ్లలో నిద్రపోతున్నవారు కూడా భయంతో బయటకు పరుగులు తీస్తున్నారని చెబుతున్నారు. ఇంట్లో వస్తువులు కిందపడిపోతున్నాయని, ఆస్‌బెస్టాస్ రేకులు పగిలి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె జబ్బులు ఉన్వారు భయంతో హడలిపోయేలా శబ్ధాలు వస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, బాంబులతో పేల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.