ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న బడుగు బలహీన వర్గాల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతు బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన సీఎం.. ఇప్పుడు దళిత బంధు పథకాన్ని కూడా అక్కణ్నుంచే ప్రారంభించనున్నారని తెలిపారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
బడుగు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని మంత్రి గంగుల స్వాగతించారు. కరీంనగర్ అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
పట్టించుకున్న నాథుడే లేడు..
70 ఏళ్ల నుంచి తెలంగాణలోని బలహీన వర్గాల ప్రజలను పట్టించుకున్న నాథుడే లేడని గంగుల అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత.. అన్ని వర్గాలతో పాటు కేసీఆర్.. ఎస్సీల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. దేశంలోనే దళితుల కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిన ఏకైక సర్కార్ తెరాసదని కొనియాడారు.
బలహీనులంతా ఓటు బ్యాంకుగానే..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ప్రభుత్వాలన్ని వెనకబడిన కులాలనను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. తెలంగాణ దళితబంధు పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి నేరుగా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది.
- గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి
గెలిచినా చేసేదేముంది..
హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్‌కు తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తోంది గడియారాలు, కుట్టు మిషన్లు పంచడానికేనంటూ మంత్రి గంగుల ఎద్దేవా చేశారు. గత 20 ఏళ్లుగా అభివృద్ధి చేయని ఈటల.. ఇప్పుడు గెలిచినా ఏం చేస్తారని ప్రశ్నించారు.