వ్యాపార వైద్య, విద్య రంగాల్లో ఉత్తర తెలంగాణాలోనే తనకంటూ ప్రత్యేక స్థానం నిలబెట్టుకున్న కరీంనగర్ గత మూడు నెలలుగా వెలవెలబోతోంది. మొట్టమొదటిసారి కరీంనగర్‌లో కరోనా మహమ్మారి సోకిందన్న నాటి నుంచి కోలుకోలేకపోతోంది. మొదట్లో లాక్‌డౌన్ కారణంగా కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగినప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో నగరంలో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. ఈ క్రమంలో ఉపాధి, విద్య నిమిత్తం కరీంనగర్‌కు వచ్చిన జనం ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఎక్కడ చూసినా నగరంలో ఇళ్లకు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డులే కనిపిస్తున్నాయి.
కరోనా కారణంగా మూడు నెలలుగా అద్దె ఇళ్లు ఖాళీగా ఉండటం వల్ల అద్దెలపై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటి వరకు అద్దెలు రాకపోగా సమీప భవిష్యత్తులో మళ్లీ అద్దెలు వస్తాయన్న నమ్మకం కలగడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. చాలా మంది వ్యాపారం కోసం తీసుకున్న షటర్లు కూడా ఖాళీ చేస్తున్నారు. ఒకవైపు అద్దె రాకపోగా మరోవైపు షాపు కమర్షియల్ కింద నమోదు కావడం వల్ల విద్యుత్ బిల్లులు, మున్సిపల్ పన్నులు మాత్రం తమకు తప్పడం లేదని వాపోతున్నారు. కళాశాలలు బంద్ కావడం, నగరంలో వందలాది వుమెన్స్ హాస్టల్స్ మూతపడ్డాయి. ఎటు చూసినా సందడి సందడిగా కనిపించే వీధులు ప్రస్తుతం జనం లేక బోసిపోతున్నాయని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి: ఆషాఢం.. శూన్యమాసమే కాదు అమ్మవారి మాసం!