Pedpadalli Railway Bridge sanctioned by central government: దిల్లీ-కాజీపేట రైలుమార్గంలోని పెద్దపల్లి ప్రజల నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు ఫలితం దక్కబోతోంది.పెద్దపల్లి-కూనారం రైల్వేగేటుపై ఓవర్ బ్రిడ్జి కావాలని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో పాటు..కాజీపేట-దిల్లీ మార్గంలో మూడో రైల్వేలైన్ ఏర్పాటుతో ఇరువైపులా ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది.రైళ్ల సంఖ్య పెరగడంతో ఒక్కోసారి రైల్వేగేట్ మూసివేస్తే కనీసం అరగంట ఆగిపోవల్సిన పరిస్థితి ఉండేది.తాజాగా ఆర్‌ఓబీ మంజూరు కావడంతో ఆ సమస్య పరిష్కారం కాబోతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో పట్టణానికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. జమ్మికుంట, హన్మకొండ, కాల్వశ్రీరాంపూర్, మంథని, ఓదెల మండలాల రైతులు, ప్రజలు అవసరాల కోసం పెద్దపల్లికి వస్తుంటారు. కాజీపేట-దిల్లీ మార్గంలో మూడో రైల్వేలైన్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకలు పెరిగాయి. ఈక్రమంలో పెద్దపల్లి-కూనారం రైల్వేగేటు వద్ద తరుచుగా రైల్వేగేట్ వేసేవారు. వాహనదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఈమార్గంలో విశాఖ, సికింద్రాబాద్, తిరువనంతపురం, చెన్నై, బెంగుళూరు నుంచి రైళ్లు ముమ్మరంగా దిల్లీవైపు పరుగులు పెడుతుంటాయి. అదేవిధంగా దిల్లీ నుంచి కాజీపేటవైపు వెళ్లే రైళ్ల సంఖ్యకూడా అదే స్థాయిలో ఉంటుంది.
దేశంలో నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయిదు రైళ్లు ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. తరచుగా రైల్వేగేట్ పడి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉండేవారు. అత్యవసర సమయాల్లో రోగులను చేతుల్లో ఎత్తుకొని గేటించే పరిస్థితి ఉండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇంతకాలం బ్రిడ్జి వాయిదా పడుతూ వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 బ్రిడ్జిలు నిర్మించాలని వినతులున్నా... ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు మాత్రమే మంజూరు చేశామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అందులో ఒకటి పెద్దపల్లికి రావటం సంతోషకరమన్నారు. వంతెన పనులు వెనువెంటనే ప్రారంభించి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: