రైతుబంధు తరహాలోనే దళితబంధు కూడా విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రులు స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళితబంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. లక్షమందితో నిర్వహించే సభాప్రాంగణంతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు ఇతర అన్ని అంశాలపై చర్చించారు.
రాష్ట్రం గర్వపడుతోంది..
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ఎన్నో గొప్ప పథకాలతో రాష్ట్రం గర్వపడుతుంటే.. దేశం ఈర్ష పడుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధానులు మారినా.. అంబేడ్కర్ కలలుగన్న సామాజిక మార్పు దళితుల జీవితాల్లో రాలేదన్నారు. ఈ మార్పుకి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబందు పథకాన్ని రూపొందించారన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి.. ఈనెల 16న నిర్వహించబోయే దళితబంధు సభను విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఎన్నికల పథకం కాదు...
"ఇంత గొప్ప పథకాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మంది దళితబంధుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వారనుకుంటున్నట్టు దళితబంధు పథకం.. ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులపై విశ్వాసం కలగాలంటే... వారు రూపొందించే పథకాలతో ప్రజలకు మేలు కలిగి, వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. అలాంటి విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించే.. గొప్ప పథకమే సీఎం కేసీఆర్ సంకల్పించిన దళితబంధు. రైతన్నల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని వారికి కావాల్సిన కరెంటు, నీళ్లు, పెట్టుబడిని అందించడం కోసం కాళేశ్వరం వద్ద ఆనకట్ట ద్వారా బీడు భూములకు నీళ్లు మల్లించాం. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో పాటు రైతుబంధు, రైతుబీమా ద్వారా భరోసాను అందించాం. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను సాకారం చేసుకున్నాం. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిదంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, గురుకులాలు వంటి ఎన్నో అద్భుతమైన పథకాల్ని అందించాం. స్వరాష్ట్రానికి ముందు దళితులకు విద్య అందలేదు. గతంలో 16 గా ఉన్న గురుకులాల్ని నేడు 261కి పెంచిన ఘనత మా ప్రభుత్వానిదే." -గంగుల కమలాకర్, మంత్రి
ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదు..
"దళితవర్గాల కోసం రాష్ట్ర సర్కారు ఎంతగానే ఆలోచించి దళితబంధు పథకం తీసుకొచ్చింది. దేశంలోని ఏ రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి పథకం తీసుకురాలేదు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దళితబంధు అమలుపై కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సంపూర్ణంగా చర్చించడమే కాక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పూర్తి సాచ్యురేషన్ మోడ్‌లో దళితుల కోసం అమలు చేస్తున్న దళిత బందు పథకంలో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదు." - కొప్పుల ఈశ్వర్ ,సంక్షేమ శాఖ మంత్రి
ఇవీ చూడండి: