Floods Effect in Sircilla: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల పట్టణం మునిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని తేల్చిన అధికారులు... ముంపునకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తలపెట్టారు. బోనాల శివారులోని కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పు ఉంటే... అక్రమార్కులు పూడ్చివేయడంతో.. వెంకంపేట, ధోబీఘాట్‌కు చేరేసరికి 10మీటర్లకు తగ్గిపోయింది. ఇందులో నుంచి వచ్చిన వర్షపు నీరు ఎక్కువశాతం రోడ్లపైనే ప్రవహించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వరద కాస్తా స్థానికంగా ఉన్న ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణంలోని వెంకంపేట, అశోక్‌నగర్, జయప్రకాశ్‌నగర్, అంబికానగర్, సంజీవయ్యనగర్, పాతబస్టాండ్, ఆసిఫ్‌పుర, శ్రీనగర్ కాలనీలను వరద ముంచేసింది. కాలువ నుంచి వచ్చే వరద నీరు కొత్తచెరువు చేరుకొని... నాలాల ద్వారా దామెరకుంటలో కలవాల్సి ఉంటుంది. కానీ, కొత్త చెరువు కింద నాలాలు ఆక్రమణకు గురై ప్లాట్లుగా వెలిశాయి. కొన్నిచోట్ల వాటిపై ఏకంగా భవనాలు నిర్మించారు. దీంతో నాలాలు పూర్తిగా మూసుకుపోయి చెరువులో నుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. శాంతినగర్ వీధుల్లో దాదాపు 4వేల ఇళ్లలోకి నీరు చేరుతోంది. ఫలితంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గతేడాది ముంపునకు గురికాగా....అధికారులు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారని... కానీ తగిన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు తెలిపారు.
వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద కష్టాలు వీడటం లేదు. నీట మునిగిన ఇళ్లలో బురద కారణంగా సామగ్రి పాడైపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రహదారులపైనా ఇసుక మేటలు, గోతులే దర్శనమిస్తున్నాయి. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లే రోడ్డులో కొత్త చెరువు ఉద్ధృతి కారణంగా రోడ్డు దారుణంగా దెబ్బతింది. శరవేగంగా అభివృద్ది చెందుతున్న సిరిసిల్ల పట్టణంలో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చి... కాలనీలు నీట మునిగాక ఇప్పుడు నాలిక కరుచుకొనే పరిస్థితి నెలకొంది. గతేడాది అక్రమంగా నిర్మించిన దాదాపు 1500 ఇళ్లు తొలగించేందుకు మార్కింగ్ పూర్తి చేశారు. కానీ పనులు మాత్రం చేపట్టకపోవటంతో సమస్య మళ్లీ మెుదటికి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త చెరువు మత్తడి శాంతినగర్‌ను ముంచెత్తుతుందని... నీటిని శ్రీనగర్ కాలనీ మీదుగా తూముకుంట చెరువుకు మళ్లిస్తున్నారు. అయినా ప్రస్తుతం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పటిలాగే మరోసారి వరద ముంపునకు గురైంది. మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన కచ్చాకాలువ నిర్మాణం వృథా అయ్యిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: