ఏపీలో కోళ్ల పందేలు జోరుగా సాగాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా... ఉపయోగం లేకుండా పోయింది. ప్రజా ప్రతినిధులు కూడా పందేల్లో పాల్గొన్నారు. భోగి రోజున కోట్లలో జూదానికి తెరలేచింది. కోడిపందేలకు తోడు గుండాట, పేకాటలనూ నిర్వహించారు. వేల సంఖ్యలో కార్లలో ఔత్సాహికులు ఈ పందేలు చూసేందుకు, ఆడేందుకు వచ్చారు. మామూలు పందేల నుంచి కోసు పందేలు, ముసుగు పందేలనూ ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించారు. కనుమ రోజుతో ముగించకుండా.. మరో రెండు రోజులు అదనంగా నిర్వహించేందుకు అనధికారిక అనుమతులు వచ్చేసినట్లు తెలుస్తోంది.
బరులు పంచుకున్నారు
పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం కోడి పందేలు జోరుగా సాగాయి. దెందులూరు, ఆకివీడు, పెదవేగి, కుక్కునూరు, భీమవరం, అయిభీమవరం, వెంప, పాలకొల్లు, లింగపాలెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, మొగల్తూరు, పోడూరు, కామవరపుకోట తదితర ప్రాంతాల్లో భారీగా పందేలు వేశారు. బరుల్లో రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ పందెం కడుతున్నారు. కొన్నిచోట్ల రూ.2 లక్షల చొప్పున ముసుగు పందేలు నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలవారూ ఒక్కటై బరులు పంచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే పందేలు మొదలయ్యాయి.
రాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దుల్లో భారీగా పందేలకు ఏర్పాట్లు చేశారు. ఈ బరులకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కరోనా భయాన్ని పక్కనపెట్టి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఎక్కడో తప్ప ఎవరూ మాస్క్‌లు ధరించటం లేదు. భౌతికదూరం ఊసేలేదు. శానిటైజర్ల వాడకం అసలు లేదు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచీ పందేలు చూసేందుకు వచ్చారు. రాత్రుళ్లు సైతం పందేలు నిర్వహించేలా విద్యుత్తు దీపాలు, జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు.
భోజన వసతులు
తూర్పుగోదావరి జిల్లాలో పందెం కోళ్లు కయ్యానికి కాళ్లు దువ్వాయి. 500కుపైగా బరులు ఏర్పాటుచేసి పందేలు నిర్వహించారు. వీటికి అనుసంధానంగా పేకాట, గుండాట, ఇతర కార్యక్రమాలు సాగాయి. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందనీ.. కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు పదేపదే హెచ్చరించారు. అయినా రాజకీయ ఒత్తిళ్లతో రూ.కోట్ల జూదానికి తెరలేచింది. కొత్తపేటలో కోడిపందేలను వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. చాలాచోట్ల అన్ని పార్టీల నేతలూ కనిపించారు. కాకినాడ నగరం, గ్రామీణం, కరప, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, ప్రత్తిపాడు, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన, పిఠాపురం, రామచంద్రపురం, గొల్లప్రోలు తదితర మండలాల్లో విచ్చలవిడిగా కోడిపందేలు జరిగాయి. నిర్వాహకులే భోజన వసతులు ఏర్పాటు చేశారు.
హాజరైన తెరాస ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలోనూ యథేచ్ఛగా కోడి పందేలు జరిగాయి. ప్రజాప్రతినిధులు తరలివచ్చి కోళ్లను బరుల్లోకి వదిలారు. పెదకూరపాడు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో 19 బరులు ఏర్పాటయ్యాయి. వీటిలో కోడి పందేలతో పాటు పేకాట కొనసాగింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని బలుసుపాడులో ఏర్పాటుచేసిన బరుల వద్దకు వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు పలువురు నాయకులు తరలివచ్చారు. బలుసుపాడు శిబిరం వద్దకు తెలంగాణకు చెందిన తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై పందేలు చూశారు.
ఇదీ చదవండి : జోరుగా కోడిపందేలు.. భారీగా చేతులు మారిన పైసలు