Bandi Sanjay Protest: ప్రజాసంగ్రామ యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్ఘాటించారు. తెరాస ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు నిరసనగా.. కరీంనగర్‌లోని తన నివాసం వద్ద సంజయ్ నిరసన దీక్ష చేశారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రజాసంగ్రామ యాత్రను కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రజలకు అండగా ఉండేందుకే యాత్ర చేపట్టామని.. ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదన్నారు. లిక్కర్ స్యాంలో కవితపై వచ్చిన ఆరోపణల దృష్టి మళ్లించేందుకే తమ యాత్ర అడ్డుకున్నారని ఆరోపించారు.
"ప్రజాసంగ్రామ యాత్రను కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రజాసంగ్రామయాత్రలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. ప్రజలకు అండగా ఉండేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టాం. ప్రజాసంగ్రామ యాత్ర ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదు. కుటుంబ పాలన ప్రమాదకరం అనేందుకు కేసీఆర్ పాలనే ఉదాహరణ. లిక్కర్ స్యామ్‌లో కవితపై వచ్చిన ఆరోపణల దృష్టి మళ్లించేందుకు నా యాత్ర అడ్డుకున్నారు. ఎక్కడ ఐటీ, ఈడీ దాడులు జరిగినా కేసీఆర్ కుటుంబీకుల పేర్లే వినిపిస్తున్నాయి. కుమార్తె, కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలు నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు ప్రకారమే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నా. ప్రజాసంగ్రామ యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదు. ప్రజాసంగ్రామ యాత్రలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. ఈ నెల 27న హన్మకొండలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహిస్తాం. మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ప్రజలు తరలిరావాలి." - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మరోవైపు హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలోనూ పలువురు ముఖ్యనేతలు నిరసన దీక్షకు దిగారు. ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సినీనటి జీవితా రాజశేఖర్, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన చూసి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకునే చర్యలు దిగుతున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బండి సంజయ్ పిలుపుమేరకు భాజపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగారు.