AP Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉగాది తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. ఆ తర్వాతే మంత్రిమండలిలో మార్పులు చేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలు, సామాజికవర్గాల వారీగా సమీకరణలు చూసుకుని మార్పులు చేయొచ్చని సమాచారం. కొత్త విశాఖ జిల్లాలో వైకాపా నుంచి ఇద్దరే ఎమ్మెల్యేలుండగా వారిలో అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రతిపాదించిన అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, గొల్ల బాబూరావు, ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ మధ్య గట్టి పోటీ ఉంది.
చిత్తూరు జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాలున్నాయి. వీరిలో ఒకరిని మార్చాల్సి వస్తే.. తొలగించిన మంత్రి సామాజిక వర్గానికి ఇదే జిల్లాలో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇలా సర్దుబాటు చేసేటప్పుడు కొందరికి అనూహ్యంగా పదవులు రావొచ్చని వైకాపా సీనియర్ నేత ఒకరు తెలిపారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానిని కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. సామాజిక సమీకరణలో గుమ్మనూరు జయరాంను మంత్రిగా కొనసాగిస్తారని తెలుస్తోంది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కృష్ణాజిల్లాలో బీసీ కోటాలో పోటీపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కన్నబాబును కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఇదే జిల్లాలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకూ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం నుంచి నిధులు, అప్పులు తెచ్చేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డినే కొనసాగించవచ్చనే చర్చ నడుస్తోంది.
కాపు సామాజికవర్గం నుంచి..
కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఈసారి కాపు సామాజికవర్గం నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అయిదుగురు మంత్రులు ఈ వర్గం నుంచే ఉన్నారు. కొత్తగా ఆశిస్తున్న వారిలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, భీమవరం శాసనసభ్యుడు గ్రంధి శ్రీనివాస్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు.
కాకాణికి దాదాపు బెర్తు ఖాయం?
రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్తగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అనంతపురం నుంచి అనంత వెంకటరామిరెడ్డి, మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, మంత్రాలయం శాసనసభ్యుడు వై.బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాదరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజా ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరిలో కాకాణికి దాదాపు బెర్తు ఖాయమని ప్రచారం ఉంది. ఆళ్ల, మేడాకు గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారనేది తెలిసిందే. బాలనాగిరెడ్డి సోదరులు మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కుటుంబంలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి మహిళా కోటాలో రోజాకు అవకాశం దక్కొచ్చని ఆమె వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు.
ప్రస్తుతమున్న మంత్రుల్లో బీసీలు అయిదుగురున్నారు. ఈ కోటాలో పోటీ పడుతున్న వారిలో రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, కాపు రామచంద్రారెడ్డి, ముత్యాల నాయుడు, ఉషశ్రీ చరణ్, కె.పార్థసారథి, జోగి రమేష్ ఉన్నారు. ముస్లీంల్లో హఫీజ్‌ఖాన్, ముస్తఫా మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎస్టీల్లో పీడిక రాజన్నదొరకు అవకాశమివ్వొచ్చని వైకాపా వర్గాలు చెబుతున్నా.. కళావతి పోటీలో ఉన్నారు. భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ఫల్గుణ మధ్య పోటీ ఉంది. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి తొలివిడతలో ఎవరికీ అవకాశం ఇవ్వలేదు.
ధర్మాన, ఆనం..?
కోన రఘుపతి, మల్లాది విష్ణు ఇద్దరిలో ఒకరికి పదవి రావచ్చన్న చర్చ ఉంది. ఇన్ని సమీకరణల మధ్య కొత్త మంత్రివర్గ కూర్పు, రాబోయే ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై వైకాపాలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. సీనియర్లైన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డికి ఈసారి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
ఇదీచూడండి: ఎందుకు ఓడుతున్నాం..! వరుస ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్ సంఘర్షణ