విశాఖలో మరో దారుణం. తాను డాక్టర్‌నంటూ 20 మంది మహిళలపై లైంగిక దాడి చేసిన వంకా కుమార్ విషయం మరుగునపడక ముందే అలాంటిదే మరో దుర్మార్గం. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి.. చివరికి నిలువుదోపిడీ చేసేశాడు.
మత్తుమందిచ్చి...
ఆమెకు మత్తుమందిచ్చి, స్పృహలో లేని సమయంలో అభ్యంతరకర చిత్రాలు తీశాడు. వాటిని అంతర్జాలంలో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అందినకాడల్లా అప్పులు చేసేసి..
రోజురోజుకూ వేధింపులు ఎక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వకపోతే ఆ చిత్రాలు బహిర్గతం చేస్తానని బెదిరించేవాడు. గత్యంతరం లేక అందినచోటల్లా అప్పులు చేసి ఆ మృగాడికి రూ.50 లక్షలకు పైగా ఇచ్చింది. ఇవ్వడానికి ఇక తన దగ్గర డబ్బులు కూడా లేవని అతడిని వేడుకుంది. కానీ అతనిలో కరుణ కలగలేదు. వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
కొడుకు పాపంలో తల్లిదండ్రులకూ వాటా!
చివరికి ఆమె అతడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అప్పుల్లో కూరుకుపోతున్నానని.. వదిలిపెట్టమని వేడుకుంది. వారి కాళ్లావేళ్లా పడింది. వాళ్లిద్దరూ కొడుకు అకృత్యాలకు అడ్డుచెప్పకపోగా... అతణ్ని మరింత ప్రోత్సహించారు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తెచ్చినప్పుడల్లా అతని అమ్మానాన్నలు కూడా ఆ మొత్తాన్ని పంచుకునేవారని విచారణలో తెలిసి పోలీసులే విస్తుపోతున్నారు.
ఆ ఫొటోలు ఓ మిత్రుడికి ఇచ్చి...
నిందితుడు ఆమె అభ్యంతరకర ఫొటోలను ఓ మిత్రుడికిచ్చి అతనితో కూడా ఒకసారి డబ్బులు వసూలు చేయించాడని తేలింది. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నా అతను కన్నుగప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు.
అనుమానం వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులపై నిఘా పెట్టారు. ఎస్సై స్థాయి అధికారి ఆ వ్యక్తికి కొమ్ముకాస్తున్నట్లు తేలడంతో నివ్వెరపోయారు. నిందితుడి తండ్రిని, స్నేహితుణ్ని ఇప్పటికే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
ఇదీ చదవండీ...