లాటరీల పద్ధతిలో కేటాయించిన 40 రెండు పడకల ఇళ్లలో 30 వరకు ఇప్పటికే ఇల్లు అనర్హులకు దక్కాయంటూ ఖమ్మంకు చెందిన మహిళలు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల్లో పేదలకు న్యాయం జరిగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ముప్పై ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ, కనీసం పిల్లలను కూడా చదివించుకోలేని స్థితిలో ఉన్నవారికి కాకుండా అనర్హులకు రెండు పడకల గదులు కేటాయించారని వాపోయారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా.. స్పందించడం లేదని, ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించారు.