Woman Arrest and Release: కర్ణాటకకు చెందిన మద్యం దాచిపెట్టిందని ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో లలితాబాయి అనే మహిళను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే.. శనివారం రోజు మాజీ మంత్రి శంకరనారాయణను నిలదీసిన లలితాబాయిని.. పోలీసులు మరుసటి రోజే అదుపులోకి తీసుకోవటం చర్చనీయాంశమైంది. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమెను సొంత పూచీకత్తుపై వదిలేశారు.
అసలేం జరిగింది..: పింఛన్ తీసేశారంటూ మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మల్యే శంకర నారాయణపై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లలితాబాయి అనే మహిళ ఇంటికి వెళ్లారు. 11 నెలలుగా పింఛన్ నిలిపివేశారని రగిలిపోతున్న లలితాబాయి ఇదే విషయంపై ఎమ్మెల్యేను నిలదీశారు. ఐతే మళ్లీ వస్తానంటూ శంకరనారాయణ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు.
సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో లలితాబాయి ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. "నిలబడి సమాధానం చెప్పలేరా ?" అంటూ నిలదీసింది. ఇంటి సభ్యులు అంతా సముదాయిస్తున్నా ఆమె శాంతించలేదు. "ఈసారి ఓట్లడగడానికి వస్తారుగా అప్పుడు చూస్తా" అంటూ లలితాబాయి హెచ్చరించారు. ఎమ్మెల్యేతోపాటు అధికార గణం మాత్రం ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసినట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.