Complaint on Care hospital in HRC: ఓ బాలుడికి ఆపరేషన్ చేసి కుట్లు విప్పకుండా డబ్బుల కోసం వేధిస్తున్న కేర్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని... బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి న్యాయం చేయాలని ఎంబీటీ నాయకులతో కలిసి వారు హెచ్‌ఆర్సీని వేడుకున్నారు.
రాజేంద్రనగర్‌కు చెందిన 12ఏళ్ల ఉమేర్ అహ్మద్‌కి కామెర్లు(జాండీస్) రావడంతో... బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. లివర్ ట్రాన్స్ఫరెంట్ ఆపరేషన్ కోసం మొదట ఆసుపత్రి యాజమాన్యం 18లక్షల రూపాయలు కట్టించుకుందన్నారు. కుట్లు విప్పడానికి అదనంగా మరో 8లక్షలు డిమాండ్ చేసిందని పేర్కొన్నారు.
అంత కట్టలేమని చెప్పడంతో వైద్యులు తమ కుమారుడిని ఇంటికి పంపించారని చెప్పారు. సమయానికి కుట్లు తొలగించక పోవడంతో... అబ్బాయి ఆరోగ్యం క్షిణిస్తోందని న్యాయం చేయాలని వారు హెచ్చార్సీని ఆశ్రయించారు. స్పందించిన హెచ్చార్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య... తక్షణమే బాలుడికి కుట్లు విప్పాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఇదీ చదవండి:హైటెక్ సిటీలో కలుషిత నీరు తాగి 57 మందికి అస్వస్థత