రైతు చట్టాల విషయంలో భాజపా ప్రభుత్వం మోసపూరిత వైఖరిని అవలంభిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిల్లీలో ఆరోపించారు. పార్లమెంటులో కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు గానూ... ప్రజలను తప్పుదోవపట్టించేలా మోదీ ప్రభుత్వం సమాధానమిస్తోందని తెలిపారు. రైతులు చేస్తున్న నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే అంశంలో భాజపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు చట్టాలను ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ తరఫున తెలంగాణలో ఉద్యమం కొనసాగిస్తామని... అన్నదాతలు చేస్తున్న నిరసనలకు పూర్తి మద్దతిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
భాజపా, తెరాస వైఖరి... "గల్లీ మే కుస్తీ... దిల్లీ మే దోస్తీ" అన్నట్లుందని ఉత్తమ్ విమర్శించారు. అన్ని కీలకాంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూనే... తామేదో భాజపాకు వ్యతిరేకమన్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రైతు చట్టాల విషయంలో తెరాస తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాసేపు వ్యతిరేకమని... మరికాసేపు మద్దతిస్తున్నమంటూ... ప్రజలను అయోమయంలో పడేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ పెట్టి రెండు రోజులవుతున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడకపోవటమేంటని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. తెరాస, భాజపాల మధ్య రహస్య ఒప్పందం మరోసారి భయటపడిందని ఆరోపించారు.