CM KCR in TRSLP Meeting : కేంద్రంపై మరోసారి పోరాటానికి తెరాస సన్నద్ధమైంది. యాసంగి వడ్లు కొంటారా..? కొనరా..? చెప్పాలంటూ గతంలో ఆందోళనలు చేసిన గులాబీ దళం.. ఈసారి కచ్చితంగా కొనాల్సిదేనంటూ ఉద్యమానికి వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శాసనసభా పక్షం భేటీ జరిగింది. ఈ సమావేశంలో యాసంగి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెరాస నిర్ణయించింది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. కేంద్రంపై పోరుకు కార్యాచరణపై తెరాస శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ కీలక సమావేశానికి.... తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎమ్మెస్ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాడాలని సీఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి దిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. కేంద్రం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం కశ్మీర్ ఫైల్స్‌ను వదిలిపెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీఎం ఎద్దేవా చేశారు.
సమావేశం అనంతరం..
తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల బృందంతో కలిసి దిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. గత నవంబరులోనూ ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలవలేకపోయారు. ఈసారి ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. సీఎంవో ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీకోసం మూడు నాలుగు రోజులు కేసీఆర్ దిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. సమస్య పరిష్కారమయ్యాకే హైదరాబాద్ రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
లోక్‌సభలో, రాజ్యసభలో తెరాస ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పంజాబ్ ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తున్నందున.. రాష్ట్రంలోనూ పూర్తిగా ఎఫ్‌సీఐ సేకరించాలని తెరాస డిమాండ్ చేస్తోంది.
CM KCR in TRSLP Meeting 2022 : "తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాడాలి. గ్రామస్థాయి నుంచి దిల్లీ వరకు ఉద్యమం సాగాలి. కేంద్రం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోంది. కశ్మీర్ ఫైల్స్‌ను వదిలిపెట్టి మోదీ సర్కార్ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి. వాటికి పరిష్కారాలను చూపించాలి. రాష్ట్రంపై అనేక విషయాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోంది."
- కేసీఆర్, తెలంగాణ సీఎం
- ఇదీ చదవండి : 'రైతులను మోసం చేసి కేంద్రంపై నెపం'