హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర సమితిని అజేయ శక్తిగా మార్చాలని పార్టీ నేతలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు కచ్చితంగా వస్తాయని తెలిపారు. నగరంలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నగరంలోని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, నియోజకవర్గాల ఇంఛార్జులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
సమన్వయంతో పనిచేయాలి..
ఇప్పటికే హైదరాబాద్ నగరం మినహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ స్థానిక కమిటీల నిర్మాణం పూర్తయ్యిందని కేటీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో నగరంలోనూ డివిజన్ కమిటీల నిర్మాణం నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ నేతలకు సూచించారు. తెరాస అజేయమైన శక్తిగా మారేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎంతో దోహదపడుతుందన్నారు. నగరంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రానున్న పది రోజుల పాటు జరగనున్న సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇంఛార్జీలుగా నియమిస్తామన్నారు.
ఉత్సాహంగా ఉన్నారు...
సంస్థాగత కార్యక్రమాల పట్ల కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు అందరూ ఉత్సాహంగా ఉన్నారని నగర నేతలు కేటీఆర్కు తెలిపారు. గణేశ్ ఉత్సవాల కారణంగా సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కొంత ఆలస్యమైందని.. నెలాఖరులోగా పూర్తవుతుందని వివరించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్లు, నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: