TRS MPs Boycotted President's Speech : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు నుంచే తెరాస నిరసన ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు తెరాస ఎంపీలు ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేనందున.. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉన్నారు.
గళమెత్తాల్సిందే..
Parliament Budget Sessions 2022 : ఆదివారం రోజున జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీలో.. రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడని సీఎం కేసీఆర్ తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. చట్టపరంగా కేంద్రం నుంచి రావాల్సినవి కూడా రావట్లేదన్న కేసీఆర్.. విభజన హామీలు, ఆర్ధిక సంఘం సిఫారసులపై పోరాడాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల కోసం పోరాడాలని చెప్పారు. జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాటం చేయాలని అన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేకపోతే నిరసన తెలపాలని నిర్ణయించారు.
ఏడున్నరేళ్లలో ఏం ఇచ్చారు...
గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ సమయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నా ఏం మాత్రం పట్టింపు లేదని తెరాస నేతలు మండిపడుతున్నారు. వారి డిమాండ్లలో...
- ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు
- షెడ్యూల్ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉంది
- శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కాగితాలకే పరిమితం
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు
- హైదరాబాద్‌లో ప్రతిపాదించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.)ను విశాఖకు తరలించారు
- రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా మంజూరు చేయలేదు
- గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపినా స్పందన లేదు
- యాసంగి ధాన్యం సేకరణపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు
- ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలోనూ నిబంధనలను సవరించి, రాష్ట్రాల పాలనలో జోక్యానికి పూనుకుంది
ఆర్థిక సర్వే..
Union Budget 2022-23 : ఇవాళ ఉభయసభలనుద్దేశించి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రోజున దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 2021-22 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
- ఇదీ చదవండి : లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే.. జీడీపీ వృద్ధి ఎంతంటే?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!