కోటి సభ్యత్వాలే లక్ష్యంగా... తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకెళ్తోంది. గతేడాది 60 లక్షలుగా నమోదైన సభ్యత్వాలను... కోటికి పెంచాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సిరిసిల్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు... సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. మండల స్థాయిలో సామాజిక మాధ్యమాల కమిటీలను ఏర్పాటు చేస్తామని... మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. రెండు ఎన్నికల్లో గెలిస్తేనే కొందరు ఎగిరిపడుతున్నారంటూ... భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అనే పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన పార్టీలను తన్ని తరిమేశామని పేర్కొన్నారు.
రికార్డు తిరగరాయాలి...
దేశంలోనే అత్యధికంగా 60 లక్షల సభ్యత్వాలు కలిగి ఉండి తెరాస రికార్డుకు ఎక్కిందని... ఈ సారి ఆసంఖ్య కోటికి చేరాలన్నదే లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. తెరాస ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి... పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు.
కార్యకర్తల సంక్షేమం కోసం...
దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్... అధికారంలో ఉన్న భాజపా... ఏనాడూ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించలేదని.. మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్‌లో... ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి... ఆమె తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు పంక్షన్ హాల్‌లో.. ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో... తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని.. శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.