TRSLP Meeting on September 3rd : వచ్చే నెల 3వ తేదీన సాయంత్రం తెరాస శాశనసభాపక్ష సమావేశం జరగనుంది. అదే రోజున ఉదయం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం టీఆర్ఎస్ఎల్పీ భేటీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ భేటీకి ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు, గిరిజనుల పోడు భూములు, ప్రస్తుత రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
TRSLP Meeting news : సెప్టెంబర్ 3న జరిగే మంత్రివర్గ భేటీలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశాలు నిర్వహించే తేదీలు ఖరారు చేయనున్నారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్ ఓ నిర్ణయానికి రానుంది.
మరోవైపు ఈనెల 31న బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన చేయనున్నారు. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు. కేసీఆర్ ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నా బయలుదేరి వెళ్తారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బిహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థికసాయం అందించనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు.