TRS foundation day: తెరాస వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 27న హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరగనుంది. ఈనెల 27న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు, ప్రసంగాలు జరగనున్నాయి. ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థలు, జిల్లా రైతుబంధు సమితి ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా, మండల, పట్టణ అధ్యక్షులు... ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
ఉదయం పది గంటలకల్లా పార్టీ ప్రతినిధులు సమావేశానికి చేరుకోవాలని కేసీఆర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 వరకు ప్రతినిధుల నమోదు ఉంటుంది. సుమారు 11 గంటల 5 నిమిషాలకు కేసీఆర్ చేరుకొని పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. స్వాగతోపన్యాసం, అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రసంగం అనంతరం... 11 అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు. రెండు దశాబ్దాల పార్టీ ప్రస్థానం, సుమారు ఎనిమిదేళ్ల పాలన, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్లు కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలా.. ఇతర పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి పెట్టాలా అనే అంశంపై తర్జన భర్జన జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో తెరాస పోషించబోయే పాత్ర, వేదికపై వ్యవస్థాపక దినోత్సవాన కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, కేంద్రంలో మోదీ సర్కారు వైఫల్యాలపై తీర్మానాలు చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్లో కరోనా తీవ్రత ఉన్నందున... ద్విదశాబ్ది ప్లీనరీని అక్టోబరు 25న నిర్వహించారు.
ఇదీ చదవండి : నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..