కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మే డే సందర్భంగా గాంధీభవన్‌లో ఐఎన్టీయూసీ జెండా ఎగురవేశారు. కరోనా సమయంలో పేదలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న సెస్ నిధులు తెరాస ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శించారు.
వలస కార్మికులను, పేదలను ఆదుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉత్తమ్ అభినందించారు. ఎంత మంది వలస కార్మికులు ఉన్నది కూడా పాలకులకు తెలియదని ఎద్దేవా చేశారు. ఇతర దేశాల్లో సంక్షేమానికి ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తుండగా... ఇక్కడ మాత్రం ఉద్యోగుల వేతనాల్లో కోతపెడుతున్నాయని విమర్శించారు. త్వరలో గవర్నర్ను కలిసి సమస్యలు విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ