Jaipalreddy Jayanthi: రాజకీయ విలువలు కాపాడడంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఒకరని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని స్ఫూర్తిస్థల్‌లో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఇతర పార్టీ నేతలు నివాళులు అర్పించారు. జైపాల్‌రెడ్డి లేకపోయినా.. ఆయన సాధించిన తెలంగాణలో మనం ఉన్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. జైపాల్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయన్నారు. రాజకీయాలు అంటే పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్లు, కాంట్రాక్టులుగా కేసీఆర్ మార్చేశారని దుయ్యబట్టారు. జైపాల్ రెడ్డి స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని చెప్పారు.
పీవీ, మర్రి చెన్నారెడ్డి సరసన నిలిచే నాయకులు జైపాల్‌రెడ్డి అని రేవంత్ పేర్కొన్నారు. నాడు కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. సకలజనుల సమ్మె, పార్లమెంట్లో ఎంపీల ఆందోళనలు జరుగుతున్న సమయంలో తమకు దైర్యం చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ఆలోచనను వ్యతిరేకించి, అడ్డుకున్నారని రేవంత్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: