ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎస్ఈసీ చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. బుధవారం గవర్నర్తో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని భావిస్తున్నామని.. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి షెడ్యూల్ ఖరారు చేస్తామని ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, కేంద్రం నుంచి నిధులు రావాల్సిన అవసరం ఉన్నందున ఎన్నికల నిర్వహణ చేపట్టవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే బిహార్ అసెంబ్లీ సహా తెలంగాణలోనూ దుబ్బాక ఉపఎన్నిక పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఏపీలోనూ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేశారు. బుధవారం నాటి గవర్నర్ సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు అనుకూల అంశాలు సహా ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గవర్నర్కు ఎస్ఈసీ తెలియజేయనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఇస్తోన్న నివేదికలనూ గవర్నర్కు సమర్పించే అవకాశాలున్నాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో కొందరు వేసిన పిటిషన్పై వాదనలు చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై హైకోర్టు కూడా త్వరలోనే తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.