Haritha haram: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా... రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహం పేరిట ఈనెల ఎనిమిదో తేదీన ప్రారంభమైన సంబురాలు... రేపు హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో జరిగే వేడుకలతో ముగియనున్నాయి. వాస్తవానికి ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు జరగాల్సి ఉంది. శుభకార్యాలు ఉన్నందున వాయిదా వేయాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు.. ప్రత్యేక సమావేశాలను రద్దు చేశారు. అందుకు బదులుగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం చేపట్టాలని నిర్ణయించారు.
వజ్రోత్సవాల్లో భాగంగా ఇప్పటికే వనమహోత్సవం పేరిట ప్రత్యేక సంఖ్యలో మొక్కలు నాటడంతోపాటు ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 150 వరకు ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేశారు. ఇవాళ సామూహిక హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నేలంతా పులకరించేలా పల్లె, పట్టణాల్లోని సామూహిక ప్రాంతాలు, ఖాళీస్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి పట్టణప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. అందులో సగానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. మిగతా లక్ష్యాన్ని ఇవాళ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలు, జిల్లాలకు అటవీశాఖ కోరింది. ఈ మేరకు సాయంత్రంలోగా పంచాయతీలు, పట్టణాల వారీగా నివేదికలు పంపాలని కలెక్టర్లను కోరింది.
ఇవీ చదవండి: