కార్పొరేషన్లు, పురపాలికల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల సందడి మొదలైంది. కో ఆప్షన్ ద్వారా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో సభ్యులయ్యేందుకు పలువురు నేతలు పోటీ పడుతున్నారు. పది రోజులుగా పురపాలికల్లో రాజకీయ సందడి కొనసాగుతోంది. జనవరిలో జరిగిన ఎన్నికల్లో 112 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థలను తెరాస సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌కు నాలుగు, భాజపా, మజ్లిస్‌కు చెరో రెండు పురపాలికలు దక్కాయి. వాటిలో 525 మంది కోఆప్షన్ సభ్యులకు అవకాశం ఉంది.
వారిదే నిర్ణయం
చాలాచోట్ల వీరి ఎంపికలో శాసనసభ్యులదే నిర్ణయాధికారం కావడంతో మైనార్టీ నేతలతో పాటు ఇతరులు ప్రయత్నాలను చేస్తున్నారు. ఒక్కో పురపాలక సంఘంలో మొత్తం నలుగురేసి సభ్యుల ఎంపికకు అవకాశం ఉంటుంది. ఇందులో ఇద్దరు మైనార్టీలు కాగా ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగిన ఇద్దరికి అవకాశం ఉంది. మైనార్టీలో ఒక మహిళకు.. సాధారణ సభ్యుల్లో ఒక మహిళకు అవకాశం దక్కుతుంది. కార్పొరేషన్లలో ఐదుగురు సభ్యులకు అవకాశం ఉండగా వీరిలో ఇద్దరు మహిళలు ఉంటారు.
తెరాసలో పోటాపోటీ
అధికార తెరాస పార్టీలో ఈ పదవుల కోసం పలువురు పోటీ పడుతున్నారు. శాసనసభ్యులతో పాటు మంత్రులు, పార్టీ ముఖ్యనేతల ద్వారా ప్రయత్నిస్తున్నారు. అత్యధిక స్థానాల్లో రెట్టింపు కంటే ఎక్కువమంది ఆశావహులు ఉండటంతో పార్టీ నేతలకు కొంత ఇబ్బందికరంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, పురపాలికల్లో పదవులకు భారీ డిమాండ్ ఉంది. ఎన్నికల్లో మెజారిటీ వార్డులు దక్కించుకుని కూడా పురపాలక సంఘాలను కైవసం చేసుకోలేకపోయిన నేరేడుచర్ల తదితర చోట్ల కాంగ్రెస్ కోఆప్షన్ సభ్యుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. భాజపా ఖాతాలో ఉన్న నారాయణపేట, అమన్‌గల్ పురపాలక సంఘాల్లో ఆ పార్టీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. జల్‌పల్లి, భైంసాలను ఎంఐఎం దక్కించుకోగా వాటితో పాటు నిజామాబాద్ సహా మరికొన్నిచోట్ల తెరాస, మజ్లిస్ సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి.
పలుచోట్ల నేడూ రేపు
శుక్ర, శనివారాల్లో పలుచోట్ల కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. సాధారణంగా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం తొలి సమావేశమైన 60 రోజుల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డాయి. తాజాగా పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల సందడి మొదలైంది.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'