బతుకుదెరువు కోల్పోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలతో వాస్తవాలను దాచి పెడుతున్నారని ఆరోపించారు. నవంబర్ వరకు ప్రతి కుటుంబానికి రూ.7,500లు, ఉచిత రేషన్ ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని... ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ అఖిలపక్షాలు వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో కోదండరాంతో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధికి ఇచ్చిన నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలు ప్రజల ముందు ఉంచాలన్నారు. ప్రతిపక్షాల పోరాటాల నిర్బంధాలను ప్రభుత్వం విడనాడాలని పేర్కొన్నారు. వచ్చె నెల 2న వర్చువల్ రచ్చబండ నిర్వహిస్తామని తెలంగాణ ప్రజల బతుకుదెరువు కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కోరారు.