టీఎస్‌ఆర్టీసీ ఎప్పుడూ ప్రయోగాలకే పరిమితమవుతోంది. ప్రతి బస్సులో టీవీలను అమర్చడం, డ్రైవర్, కండక్టర్ లేదా, బస్సు సహాయకుడు (కీపర్)కు పెన్‌డ్రైవ్ ఇచ్చి అందులోని పదుల సినిమాలతో నింపేవారు. ప్రయాణం ప్రారంభం కావడమే తరువాయి పేరెన్నిక గల కొత్త సినిమా ఒకటి, పాత సినిమా ఒకటి వేసి ప్రయాణం బోరు కొట్టకుండా జాగ్రత్త పడేవారు. ఒక్కోసారి పెన్ డ్రైవ్ పనిచేయక, టీవీలో బొమ్మ పడక ఇబ్బందులు వస్తున్నాయని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం, వారు శాటిలైట్ ద్వారా సినిమాలు వేసేవారురు. అదీ విఫలమై మళ్లీ ఆ బాధ్యతలను టీఎస్‌ఆర్టీసీనే భుజాన వేసుకుంది. సరైన నిర్వహణ లేక ఇప్పుడు ఏకంగా టీవీలను మూగబోయేలా చేసింది. ఇలా దాదాపు 750 బస్సుల్లో ప్రయాణికుల ముఖంలో ఆనందం ఆవిరైంది.
వోల్వో ప్రయాణం కరవు
టీఎస్‌ఆర్టీసీ వోల్వో బస్సులు దాదాపు 400 వరకూ ఉంటాయి. ఇవి విజయవాడ, బెంగళూరు పట్టణాలకే పరిమితమయ్యాయి. విశాఖ, తిరుపతి, ఆదిలాబాద్, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలకు వెళ్లేందుకు రాజధాని బస్సులే దిక్కు. ఫ్లైట్ ఆన్ రోడ్డని, స్మార్ట్ బస్సులని, ప్రైవేటు, ఇతర ఆర్టీసీ బస్సులు నగరం నుంచి పరుగులు పెడుతున్న వేళ టీఎస్‌ఆర్టీసీ దూరప్రాంతాలకు రాజధాని బస్సులతో సరిపెడుతోందని కొందరంటున్నారు.
పేరులోనే రాజధాని..
రాజధాని బస్సు పేరుకు తగ్గట్టు ఉండడంలేదు. ఏసీ తప్ప మరేమీ ఉండడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతి సీటు దగ్గర ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకుందామంటే కొన్ని పని చేయడంలేదు. సెమీ స్లీపర్ సీట్లంటారు, అవి కొన్ని ముందుకు వెనక్కు వెళ్లని పరిస్థితి. సీట్లు అరిగిపోవడంతో నడుం నొప్పి వస్తోందంటున్నారు. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య రాజధాని బస్సులతో సరిపెడుతోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ బస్సుల్లో గతంలో వాటర్ బాటిల్ ఇచ్చేవారు. ఇప్పుడు కొన్నింటిలో అడిగితేనే ఇస్తున్నారట.