పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేటి నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని తితిదే నిర్ణయించింది. స్థానిక ఆస్థాన మండపంలో మంగళవారం దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో తితిదే అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున మాట్లాడుతూ.. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులనే తిరుమలకు అనుమతిస్తామని తెలిపారు.
పంచెలు, బొమ్మలు, ఇతర వస్తువులకు బయోడీగ్రేడబుల్, పేపర్ కవర్లను ఉపయోగించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలనూ విక్రయించకూడదని తెలిపారు. తితిదే ఆరోగ్యాధికారిణి శ్రీదేవి మాట్లాడుతూ... దుకాణదారులు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని సూచించారు. తితిదే వీజీవో బాలిరెడ్డి, రెవెన్యూ విభాగం ఏఈవో చౌదరి, ఏవీఎస్‌వో సాయిగిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..